కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మహేష్ బాబు..?

రాజకీయాలకు దూరంగా ఉండే సినీ స్టార్స్ లో మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు. ఆయన రాజకీయాలపై స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. తనకు పాలిటిక్స్ పై అవగాహన లేదని చెబుతుంటారు. అలాంటి మహేష్ బాబు.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందన్న వార్త సంచలనంగా మారింది.

మహేష్ బాబు తండ్రి, లెజెండరీ యాక్టర్ కృష్ణకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం. ఆయన కాంగ్రెస్ తరపున ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కృష్ణ మంచి అనుబంధాన్ని కలిగి ఉండేవారు. అయితే మహేష్ బాబు మాత్రం రాజకీయాలకు పూర్తి దూరం పాటిస్తున్నారు. కానీ సన్నిహితవర్గాలు మాత్రం.. ఆయనకు కాంగ్రెస్ అంటే అభిమానమని చెబుతుంటారు. తాజాగా మహేష్ బాబాయ్ ఆదిశేషగిరి రావు చేసిన వ్యాఖ్యలు కూడా అదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిశేషగిరి రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మహేష్ కి రాజకీయాలపై ఆసక్తి లేదు కానీ అవగాహన మాత్రం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి స్పీచ్ లు, ప్రచారాలు చూసి.. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాడు." అని చెప్పుకొచ్చారు. దాంతో యాంకర్ "భవిష్యత్ లో మహేష్ గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా?" అని అడగగా.. ఆదిశేషగిరి రావు "అలా ఎలా చెప్పగలం" అని అన్నారు కానీ, పూర్తిగా ఖండించలేదు. దీంతో ఫ్యూచర్ లో మహేష్ పాలిటిక్స్ లోకి వస్తాడని, తన తండ్రి బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతాడని ప్రచారం మొదలైంది. అయితే మహేష్ కి రాజకీయాలపై అవగాహన ఉందేమో గానీ, ఆసక్తి లేదని.. ఆయనసలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశంలేదని అభిమానులు అంటున్నారు. చూద్దాం మరి భవిష్యత్ లో ఏం జరుగుతుందో!.